‘భారత్‌ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్‌ వీడియో వైరల్‌

Video Of Kamal Nath On Rahul Gandhi Bharat Jodo Yatra Is Viral - Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టారు పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్‌నాథ్‌ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. 

ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్‌ మిశ్రా అనే పండింతుడితో కమల్‌నాథ్‌ మాట్లాడుతున్నారు. ‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 గంటలు నడవాలి. మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్‌ మూడు ప్రీ కండిషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్‌ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని చెప్పారు.’అని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా. ‘కమల్‌నాథ్‌ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్‌ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు.

ఇదీ చదవండి: శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. సునంద మృతి కేసులో కోర్టు నోటీసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top