ఇక వాట్సాప్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌

Covid-19 vaccination certificate now available in WhatsApp - Sakshi

సెకండ్ల వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం

న్యూఢిల్లీ: కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్‌ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా మారింది. కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్‌ పోర్టల్‌ ద్వారా ఈ సర్టిఫికెట్‌ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్‌ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

అందుకే సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా కార్యాలయం ఆదివారం ట్వీట్‌ చేసింది. టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్‌ పొందవచ్చు. వాట్సాప్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్‌ ఎంపీ ట్వీట్‌ చేశారు.

వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
► మైగవ్‌ కరోనా హెల్ప్‌డెస్క్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9013151515ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.
► కరోనా వ్యాక్సిన్‌ కోసం కోవిన్‌ పోర్టల్‌లో లేదా కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఉన్న ఫోన్‌ను ఇందుకు ఉపయోగించాలి.
► వాట్సాప్‌లో కాంటాక్టు లిస్టులోని మైగవ్‌ నెంబర్‌పై క్లిక్‌ చేసి, చాట్‌ బాక్సులో covid certificate లేదా download certificate అని టైప్‌ చేయాలి.
► రిజిస్టర్డు ఫోన్‌ నంబర్‌కు ఆరు ఆంకెల ఓటీపీ వస్తుంది.
► చాట్‌ బాక్సులో ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
► కరోనా వ్యాక్సిన్‌ కోసం ఒక్క ఫోన్‌ నెంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్‌ చేసుకొని ఉంటే.. వారందరి పేర్ల జాబితాను వాట్సాప్‌ మీకు పంపిస్తుంది. వారిలో ఎవరెవరి సర్టిఫికెట్లు కావాలని మీరు కోరుతున్నారో అడుగుతుంది.
► ఎంతమంది సర్టిఫికెట్లు కావాలో సూచిస్తూ ఆ సంఖ్యను ఎంటర్‌ చేయాలి. కొన్ని సెకండ్లలోనే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వాట్సాప్‌ చాట్‌ బాక్సులో ప్రత్యక్షమవుతుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top