వ్యాక్సిన్‌ భద్రతే కీలకం : డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ

 AIIMS Director Says Safety Of Russias Covid Vaccine Needs To Be Assured - Sakshi

దేశీ వ్యాక్సిన్లపై ముమ్మర కసరత్తు

సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుట్నిక్‌ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందుగా ఇది సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగిఉందా అనేది పరిశీలించాలని ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైనదా అనేది వెల్లడికావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని డాక్టర్‌ గులేరియ అన్నారు. వ్యాక్సిన్‌ పరీక్షల శాంపిల్‌ పరిమాణం, దీని సామర్ధం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని అన్నారు. వ్యాక్సిన్‌తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. చదవండి : గుడ్‌న్యూస్‌ : తొలి వ్యాక్సిన్‌ వచ్చేసింది!

ప్రపంచంలో తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందని, వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటన చేసిన నేపథ్యంలో డాక్టర్‌ గులేరియ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాక్సిన్‌పై ఇంకా తుది పరీక్షలు జరుగుతుండగానే రష్యా వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందించే రష్యా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇక భారత్‌లో తయారవుతున్న దేశీ వ్యాక్సిన్‌లపై డాక్టర్‌ గులేరియ స్పందిస్తూ భారత వ్యాక్సిన్లు రెండు, మూడవ పరీక్షల దశలో ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల అభివృద్ధిపై భారత్‌ కసరత్తు సాగిస్తోందని, భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనకు ఉందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top