ఇన్‌చార్జి తహసీల్దార్‌గా శిక్షణ కలెక్టర్
నర్వ: మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 వారాల పాటు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానన్నారు. శనివారం జంగంరెడ్డిపల్లిలో నిర్వహించే గ్రామసభలో భూముల సర్వేపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసుల ఫ్లాగ్ మార్చ్
కోస్గి రూరల్: పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన భద్రత చర్యలు చేపడుతున్నామని సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శివాజీ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, బాహర్‌పేట, రామాలయం, మున్నూరువాడ, తెలుగువీధి, వినాయకనగర్‌లో భారీ బలగాలతో ఆ యన ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేసినా.. డబ్బు, మద్యం, ఉచిత వస్తువులు వంటి ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నా రు. కార్యక్రమంలో భీంకుమార్, ఎస్‌ఐలు బా లరాజు, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మొగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్‌కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇన్‌చార్జి తహసీల్దార్‌గా శిక్షణ కలెక్టర్


