కేసీ కాల్వకు నీటి పంపింగ్ నిలిపివేత
● ఆందోళనలో రైతులు
జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కర్నూలు–కడప కాల్వకు అధికారులు నీటి పంపింగ్ నిలిపి వేశారు. తుంగభద్ర డ్యాం మరమ్మతు పనుల్లో భాగంగా కేసీ కాల్వకు జనవరి 17 నుంచి సుంకేసుల నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. రబీలో సాగు చేసిన పంటలకు సాగునీరివ్వకపోతే పంటలు ఎండి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆందోళన చేశారు. దీంతో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కాల్వకు 5 టీఎంసీల నీటిని సరఫరా చేయటానికి ప్రభుత్వం అనుమతులివ్వటంతో జనవరి 25 నుంచి కేసీ కాల్వకు అధికారులు నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. ఆదివారం నాటికి ఐదు టీఎంసీల నీటి పంపింగ్ పూర్తికావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం పంటలు సాగు చేసి రెండు మాసాలు కాగా పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాల్వ కు సాగునీటి సరాఫరా నిలిపేస్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్య లు తీసుకొని కేసీ కాల్వకు మార్చి నెలాఖరుదాకా సాగునీటిని సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
నేడు కలెక్టరేట్‌లోప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 16 తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
వ్యవసాయ శాఖలో డిప్యూటేషన్లు!
● అవసరం లేకపోయినప్పటికీ
పైరవీల ద్వారా బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద ఎత్తున పైరవీలు చేసి డిప్యూటేషన్(ఆన్‌డ్యూటీ)పై బదిలీలు చేయించుకునే సంస్కృతి వ్యవసాయ శాఖలో ఎక్కువగా ఉంటోంది. కర్నూలు మండలం ఎదురూరు ఫామ్‌కు ఒక ఏఓ, ఒక ఏఈఓ, ఒక ఆఫీసు సబార్డినేటు పోస్టు ఉంది. ఎప్పుడూ లేని విదంగా ఇక్కడ డిప్యూటేషన్‌పై ఆరు నెలలుగా ఆదనంగా మరో ఏఓ పనిచేస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ డిప్యూటేషన్‌పై బదిలీ చేశారనే చర్చ జరుగుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష కేంద్రానికి ఒక ఏవో పోస్టు మాత్రమే ఉంది. అదనంగా మరో ఏఎ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) దాదాపు నిర్వీర్యమైంది. ఆత్మలో కూడా ఒక ఏఓ డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో టెక్నికల్ ఏవో పోస్టులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అయితే ఆన్‌డ్యూటీపై అదనంగా నలుగురు ఏఓలు పనిచేస్తున్నారు. డీఆర్‌సీలో ఇద్దరు ఏఓలు ఆన్‌డ్యూటీపై పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌డ్యూటీపై పనిచేస్తున్న వారందరూ కొనసాగించే విధంగా పైరవీ చేస్తుండగా.. మరికొంత మంది ఏఓలు ఆన్‌డ్యూటీపై బదిలీల కోసం పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రజాస్వామ్య సంఘాలు బలోపేతం కావాలి
కర్నూలు(సెంట్రల్): ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వేదికను ఇతర జిల్లాలకు విస్తరింపజేయాలని నిర్ణయించారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో దశాబ్ధి సదస్సును రోజా రమణి అధ్యక్షతన నిర్వహించారు. కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విశ్వాసాలు వేరైనా ప్రజా వ్యతిరేక విధానాలపై వేదిక స్పందిస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత భేషజాలతో పార్టీలు, సంఘాలు విడిపోతున్నాయన్నారు. భిన్న రాజకీయ విశ్వాసాలు కలిగిన సంఘాలు, సంస్థలు పదేళ్లుగా వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. విప్లవ రచయితల సంఘం బాధ్యుడు పాణి మాట్లాడారు. కార్యవర్గ సభ్యుడు రత్నంఏసేపు గతేడాది వేదిక కార్యకలాపాలు, ఆర్థిక నివేదికను సమీక్షించారు.


