బైక్ అదుపుతప్పి కిందపడి ..
ఎమ్మిగనూరురూరల్: కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తమ బంధువుల అమ్మాయికి సంబంధం కుదుర్చుకుని సంతోషంగా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఎంకప్ప(28) తమ బంధవుల అమ్మాయికి ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తెర్నేకల్ గ్రామం నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు శుక్రవారం అబ్బాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం కుదరటంతో అక్కడే భోజనాలు చేసి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. ఎంకప్ప పల్సర్ బైక్‌పై వెళ్తుండగా కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి కాలువగట్టు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక వస్తున్న బంధువులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
పాదయాత్రగా శ్రీశైలయానికి చేరుకుంటున్న భక్తులు


