వెంకటాపురంలో దొంగల హల్‌చల్
శిరివెళ్ల: వెంకటాపురంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు. దాదాపు రూ. లక్ష నగదు, రూ. 80 వేలు విలువ చేసే బంగారు కమ్మలు, ముక్కు పుడకలు చోరీకి గురయ్యాయి. ముందుగా శ్రీరామ వెంకటేశ్వర్లు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాను బయటకు తెచ్చి ఇంటి సమీపంలోని ఓ దిబ్బ వద్ద పగల గొట్టారు. శబ్ధం విన్న ఇంటి యాజమాని, చుట్టు పక్కల వాళ్లు రాగా దొంగలు పరారయ్యారు. అలాగే రిటైర్డ్ వీఆర్వో అనందయ్య ఇంటిలో బీరువాలోని బంగారు కమ్మలు, ముక్కు పుడకలు అపహరించారు. గుడి నరసింహ ఇంటిలో బీరువాలోని రూ. 80 వేలు నగదును చోరీ చేశారు. వలివేటి శేషగిరి ఇంటిలో ప్రవేశించి రూ. 20 వేల నగదును ఎత్తు కెళ్లారు. అలాగే పొదిలి చిన్న కేశయ్య టీ కొట్టులో తినుబండారాలు తిని, కూల్ డ్రింక్స్ తాగారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో నలుగురు ముఖాలకు ముసుగు వేసుకోగా, ఒకరు ఖర్చీఫ్ కట్టుకుని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఇద్దరు మహి ళలు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాము గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలో స్వామి వారి వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొలిమిగుండ్ల: తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని వేర్‌హౌస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిపల్లెకు చెందిన బండ నాగాంజనేయులు (29) పని నిమిత్తం స్నేహితులతో కలిసి జమ్మలమడుగుకు బైక్‌పై వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తిమ్మనాయినపేట జంక్షన్ వద్దకు వచ్చే సరికి బైక్‌లో ఉన్న ఇద్దరు స్నేహితులు టాయ్‌లెట్ వెళ్లేందుకు కిందకు దిగారు. నాగాంజనేయులు రోడ్డుకు అటు వైపు వెళ్లేందుకు బైక్‌ను తిప్పుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
వెంకటాపురంలో దొంగల హల్‌చల్


