కనుల పండువగా
గ్రామోత్సవం
శ్రీశైలంలో అశేష భక్తజనం మధ్య గ్రామోత్సవం
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడికి అపరభక్తుడైన రావణుడు కై లాసాన్నే పెకిలించి తీసుకెళ్లే క్రమంలో స్వామివారికి వాహనుడయ్యాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో రావణవాహన సేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో రావణవాహనాన్ని సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ప్రధాన అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. రావణ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి, పరివార దేవాలయాల్లో ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. అనంతరం గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి దేవాలయం వరకు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. నీలకంఠుడు భ్రమరాంబా సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. ఉత్సవంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవదాయవాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కమిషనర్ కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. రాజగోపురం వద్ద వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు.
నేడు పుష్పపల్లకీ సేవ
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం సాయంత్రం మల్లికార్జున స్వామికి పుష్పపల్లకీ సేవ ఉంటుంది. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.
గ్రామోత్సవంలో రావణ వాహనంపై ఆది దంపతులు
కనుల పండువగా
కనుల పండువగా


