భక్తుల నిలువు దోపిడీ
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దేవస్థానం సరిపడా సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా భక్తులు ఎక్కడికి వెళ్లినా నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీస సౌకర్యమైన మరుగుదొడ్లను ఉచితంగా ఏర్పాటు చేయలేదు. శివదీక్షా శిబిరాల వద్ద గతేడాది రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు ఈ ఏడాది రూ.20 తీసుకుంటున్నారు. పాతాళగంగ, నందిసర్కిల్, ప్రధాన ఆలయానికి ఎదురుగా పలువురు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. రోజుకు వెయ్యి మంది కార్మికులతో పనులు చేపట్టకుండా కొంతమందితో తూతూమంత్రంగా సాగిస్తున్నారు. దీంతో క్షేత్ర పరధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. టోల్‌గేట్ సమీపంలో చెప్పులు, సాక్స్‌లను భక్తులు వదిలి వెళ్తున్నా తొలగించడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం శ్రీశైలంలో వర్తించడంలేదని భక్తులు వాపోతున్నారు. ఘాట్‌రోడ్డు పేరుతో స్టాండింగ్ ఎక్కించుకోకపోవడం, తక్కువ బస్సులు ఉండడంతో మహిళా భక్తులు అవస్థలు పడుతున్నారు.
ముక్కుపిండి వసూలు
సాక్షిగణపతి ఆలయం వద్ద, మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద, నందిసర్కిల్ వద్ద భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి వారు కొబ్బరికాయ కొడితే రూ.10 ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్షేత్రంలోని చాలా హోటళ్లలో ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అధిక రేట్లు తీసుకుంటున్నారు. శివమాలను స్వీకరించిన వారు ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు.
టెంకాయ సమర్పిస్తే
రూ.10 చెల్లించాల్సిందే
ఇరుముడి విప్పితే
రూ.100 ఇవ్వాల్సిందే
రోడ్డుకు మధ్యలో వ్యాపారాలు
భక్తుల నిలువు దోపిడీ
భక్తుల నిలువు దోపిడీ


