మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు

Feb 13 2026 3:59 AM | Updated on Feb 13 2026 3:59 AM

మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు

మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు

ఈ ఏడాది 1.50 లక్షల మంది

వచ్చే అవకాశం

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి,

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

శ్రీశైలం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. దేవస్థానం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. గతేడాది మహాశివరాత్రి పర్వదినాన అత్యధికంగా 1.10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఈ ఏడాది 1.50 లక్షల మంది శివరాత్రి రోజున దర్శనం చేసుకుంటారని అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కై లాస ద్వారం నుంచి 26,000 మందికిపైగా భక్తులు కాలినడకన శ్రీశైలం చేరినట్లు చెప్పారు. వారికి వైద్య సేవలతో పాటు ఆహారం, మంచినీరు అందించామన్నారు. స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతాళగంగ వద్ద బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను కూడా నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా బస్సులు, కార్లకు విడివిడిగా పార్కింగ్‌ ప్రదేశాలను కేటాయించినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణానికి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దేవస్థానం చెక్‌పోస్టుల వద్ద ఫారెస్ట్‌ చెక్‌ పోస్ట్‌లు టోల్‌ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘాట్‌లో గంటకు 30 కిలోమీటర్ల వేగపరిమితితో వాహనాలు వచ్చేలా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. క్యూలైన్లలో పిల్లలకు మంచినీరు, వద్ధులకు పాలు, బిస్కెట్లు అందజేసే చర్యలు తీసుకున్నామన్నారు.

బందోబస్తు పరిశీలన

మహాశివరాత్రి పర్వదినానికి రెండు రోజులుగా మాత్రమే వ్యవధి ఉండడంతో సునీల్‌షెరాన్‌ భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు. గురువారం సాయంత్రం క్యూలైన్లలను పరిశీలన చేశారు. క్యూలైన్ల డివైడర్ల ఎత్తును పెంచాల్సిందిగా దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రంలో ఉన్న క్యూలు, శివాజీ గోపురం, అమ్మవారి ఆలయ ప్రాంగణం, నాగుల కట్ట ప్రాంతాలను పరిశీలించారు. శివదీక్ష స్వాముల కోసం ఏర్పాటు చేసిన చంద్రావతి కళ్యాణ మండపంలోని కంపార్ట్‌మెంట్లలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement