సీమ ప్రాజెక్టులపై వివక్ష వద్దు!
నంద్యాల(అర్బన్): రాయలసీమ వ్యవసాయాభివృద్ధికి కీలకమైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్ట్‌ల అభివృద్ధిపై వివక్ష వద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపవద్దని సూచించారు. స్థానిక సమితి కార్యాలయంలో ఆదివారం ఆయన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2026–27 బడ్జెట్‌లో రూ.8వేల కోట్లు కేటాయించాలన్నారు. సీమ సాగునీటి సమస్య ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, ఇది రాష్ట్ర వ్యవసాయ భద్రత, తాగునీటి భద్రత, ప్రాంతీయ సమతుల్యత, సమగ్ర అభివృద్ధితో నేరుగా ముడి పడి ఉందని అన్నారు. రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పూడికతో నిండిపోక ముందే, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని మార్గం సుగమం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, అసదుల్లా, భాస్కరరెడ్డి, పట్నం రాముడు, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


