ఎలిశెట్టిపల్లి బ్రిడ్జిపై సర్వే
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లేదారిలో సర్వే చేపట్టారు. చెల్పాక నుంచి ఎలిశెట్టిపల్లికి వెళ్లాలంటే జంపన్నవాగు దాటితేనే ఆ గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఎలిశెట్టిపల్లి జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ ద్వారా రూ. 21 కోట్లతో వాగుపై 200 మీటర్ల పొడవులో బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు డిజైన్ చేశారు. అయితే అక్కడ ఉన్న భూమి, పరిస్థితిని హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పీఆర్ డీఈ నరేశ్ క్షుణ్ణంగా పరిశీలించారు. గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్‌ను చేపట్టారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం, ఉధృతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జంపన్నవాగు ఉప్పొంగితే ఎలిశెట్టిపల్లి, కొత్తూరు, గిరిజనగూడేలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయేదని స్థానికులు ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణంపై సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, వావిలాల ఎల్లయ్య, రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, సర్పంచ్‌లు పలక మహాలక్ష్మీ, అట్టం రాంబాబు, దేవులపల్లి విజయ్‌కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు, మాజీ సర్పంచ్ చింత సుమలత, రమేష్, హరీష్, కుదురుపాక శ్రీనివాస్, సత్యం, రాంబాబు, సారయ్య, చెన్నెం ఎల్లయ్య పాల్గొన్నారు.
హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందం, పంచాయతీరాజ్ అధికారుల పర్యటన
రూ.21 కోట్లతో
బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్


