మహిళా సంఘాలకు భారీ ఆదాయం
మహాజాతరలో రూ. 6 కోట్ల
పెట్టుబడితో రూ. 3 కోట్ల లాభం
వెంకటాపురం(ఎం): మేడారం మహాజాతరలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, క్యాంటీన్ల ద్వారా భారీ ఆదాయం సమకూరిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మండల పరిధిలోని రామప్పలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీతక్క గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 565 ఆదాయ యూనిట్లను ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరలో మహిళా సంఘాలు రూ. 6 కోట్ల పెట్టుబడి పెడితే రూ.3 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించామన్నారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించామని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్‌డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటీన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారని వెల్లడించారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించిందన్నారు. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకు పైగా లాభం వచ్చిందని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి శాలువా కప్పి సత్కరించారు. రామప్పలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలపై ఆలయ అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రామప్ప కు వచ్చిన విద్యార్థులు సీతక్కతో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రామప్ప ఆలయ కమిటీ చైర్మన్ అయిలయ్య, నాయకులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
రామప్పలో ఇందిరా మహిళా శక్తి
క్యాంటీన్ ప్రారంభం
మహిళా సంఘాలకు భారీ ఆదాయం


