నేడే మున్సిపోల్
పోలింగ్ సామగ్రి పంపిణీ
ములుగు: ములుగు మున్సిపాలిటీకి నేడు తొలిసారిగే జరగనున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వారం రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన వివిధ పార్టీల అభ్యర్థులు గత రెండు రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 20 పోలింగ్ కేంద్రాలను 50 బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ములుగు డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి మంగళవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.
40 సీసీ కెమెరాలతో వెబ్‌కాస్టింగ్
ములుగు మున్సిపాలిటీలో 20 పోలింగ్ కేంద్రాలలో 19 కేంద్రాలు హైపర్ సెన్సిటివ్, ఒకటి సెన్సిటివ్ కేంద్రంగా గుర్తించారు. 40 కెమెరాలతో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు ఉండగా 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులకు 83మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉదయం 7గంటల నుంచే..
మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది మంగళవారం రాత్రి వరకు పోలింగ్ బూత్‌లతో పాటు, నెంబర్ల వారీగా బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సంపత్‌రావు, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ములుగు డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చనున్నారు. స్ట్రాంగ్ రూం వద్ద 70 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన కౌన్సిలర్ల పేర్లు ప్రకటించనుండగా, 16న చైర్‌పర్సన్ ఎన్నికతో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.
గుర్తింపు కార్డు తప్పనిసరి
ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్పులతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు. ఫొటోతో కూడిన పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్‌బుక్. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు. డ్రైవింగ్ లైస్సెన్స్ తదితర గుర్తింపు కార్డులు ఉండాలని వెల్లడించారు.
పోలింగ్‌కు పకడ్బందీ చర్యలు
మున్సిపాలిటీ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సామగ్రిని చెక్‌లీస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
సిబ్బంది వివరాలు ఇలా..
కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
ఉదయం 7నుంచి సాయంత్రం
5 గంటల వరకు పోలింగ్
ములుగు మున్సిపాలిటీకి
తొలిసారిగా ఎన్నికలు
20 వార్డులకు..
83 మంది అభ్యర్థులు పోటీ
నేడే మున్సిపోల్
నేడే మున్సిపోల్


