దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్‌ఎస్ తాడ్వాయి: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్‌మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులకు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు హనుమకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భూపాలపల్లి అర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఈ కోర్స్ ద్వారా ట్యాలీ ప్రైమ్ (జీఎస్టీ) ఉపయోగించి వ్యాపార కౌంటింగ్, బిల్లింగ్ ఇన్వెంటరీ నిర్వహణకు సంబంధించి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించే విధానాన్ని శిక్షణార్థులు నేర్చుకుంటారని తెలిపారు. కోర్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు జూనియర్ అకౌంటింగ్, అకౌంట్స్ అసిస్టెంట్, జీఎస్టీ అసిస్టెంట్ బిల్డింగ్ ఆపరేటర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు, హక్కుల పరిరక్షణకు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని అన్ని గనుల వద్ద గేట్ మీటింగ్‌లు నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటా యించి, పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని తెలిపారు. ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత, సర్పంచ్‌్ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం, కోలిండియా పరిధిలో ఉంటాయని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మె కారణంగా సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి నష్టం జరగడం వలన రూ.77 కోట్లు, కార్మికులకు రూ.12కోట్ల నష్టం వాటిల్లితుందన్నారు. నూతన లేబర్ కోడ్‌ల వలన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు నష్టం లేదన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. కార్మికులు గ్రహించి సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యాంసుందర్, శ్రావణ్ పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు


