ఆధ్యాత్మికతతో శివరాత్రి ఉత్సవాలు
వెంకటాపురం(ఎం): రామప్పలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, రామప్ప ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు హరీశ్‌శర్మ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా రామప్పలో పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలు గుర్తించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని వివరించారు. అలాగే రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల కోసం అవసరమైన పందిళ్లు, తాగునీటి వసతికి చలివేంద్రాలు తదితర ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. రామప్ప ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి నది పుష్కర ఘాట్లు ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) ప్రాంతాల్లోని ఘాట్ల వివరాలు, అక్కడ చేపట్టాల్సిన పనులపై సమగ్ర సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


