‘ఆమె’నే నిర్ణేత!
● ఓట్లు..సీట్లలో ఆధిపత్యం
● జనరల్ స్థానాల్లోనూ పోటీ
● ములుగు తొలి చైర్‌పర్సన్ మహిళకే..
ములుగు : ములుగు మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయాధికారం అతివలదే. ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో వారే కీలకపాత్ర పోషించనున్నారు. ములుగు పట్టణ పరిధిలో 6,661 పురుష ఓటర్లు ఉండగా 7,300 మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 639 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో తొలిసారిగా మహిళనే చైర్‌పర్సన్ సీటుపై ఆశీనులు కానున్నారు. ఇలా ఓట్లు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తిగల మహిళామణులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. చైర్‌పర్సన్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పలువురు మహిళా అభ్యర్థులు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం నారీశక్తికి నిదర్శనమని చెప్పొచ్చు.
మహిళలు 46, పురుషులు 37 మంది..
ఓట్లలోనే కాదు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ములుగు మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు గాను 10 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. ఆయా వార్డుల్లో మహిళలే పోటీ చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో మొత్తం 83 మంది అభ్యర్థులు బరిలో నిలువగా అత్యధికంగా మహిళా అభ్యర్థులే ఉండడం ఆసక్తిని రేపుతోంది. మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 83 మందిలో మహిళా అభ్యర్థులు 46 మంది పోటీ చేస్తుండగా, పురుషులు 37 మంది బరిలో ఉన్నారు. మహిళలకు 10 స్థానాలు కేటాయించగా వివిధ రిజర్వేషన్‌లకు చెందిన జనరల్ స్థానాల్లో కూడా మహిళలు అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం గమనార్హం. జనరల్‌కు కేటాయించిన 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ తరఫున మహిళలు బరిలో నిలిచారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ నుంచి 2, 6, 7, 20 వార్డుల్లో బీఆర్‌ఎస్ నేతలు తమ సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీలో నిలిపారు. ఇలా రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడుతున్నారు. కౌన్సిలర్‌గా విజయం సాధిస్తే చైర్మన్ పీఠాన్ని అధిరోహించవచ్చనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
నిర్ణయాధికారం ఆమెదే..
ఆయా వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించగల శక్తి వారికే ఉంది. మహిళా ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు నిలబడుతారో వారే ఆ వార్డులో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే అధికారం మహిళా ఓటర్లకే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి ఓట్లు రాబట్టేందుకు పరితపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక బహుమతులను అందజేయడంతో పాటు తాము గెలిస్తే మహిళల కోసం కాలనీలో ప్రత్యేక సదుపాయలు కల్పిస్తామని హామీలిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మున్సిపల్ సమాచారం
మొత్తం వార్డులు: 20
బరిలో ఉన్న అభ్యర్థులు: 83
మహిళలు: 46
పురుషులు: 37
పురుష ఓటర్లు: 6,661
మహిళా ఓటర్లు: 7,300


