‘ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి’
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఫార్మసీ డిపార్టుమెంట్ విభాగంలోని కోర్సులను నెలకొల్పి తక్షణమే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్శిటీలో త్వరలో ప్రారంభించపోయే ఇంజనీరింగ్ కోర్సులు ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈలతో పాటు బ్యాచ్‌లర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులు కూడా ప్రారంభించాలన్నారు. గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఎంఏ లిబరల్ స్టడీస్, ఎంఏ డెవలప్‌మెంట్స్ స్టడీస్‌లతో పాటు మాస్టర్ ఆఫ్ ఎం ఫార్మసీలలో అన్ని స్పెషలైజేషన్ కోర్సులు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.
జాతరపై తప్పుడు ప్రచారం చేయొద్దు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై తప్పుడు ప్రచారం చేయొద్దని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అన్నారు. మేడారంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం 90 రోజుల్లో పూర్తి చేయడం హర్షించదగిన విషయమన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుపొంది, కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరలో చిన్న చిన్న లోటుపాట్లు తలెత్తుతాయని వాటిని కొంత మంది బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో చాలా సమస్యలు తలెత్తాయని, అయినా పూజారులుగా తాము సర్ధుకుపోయామే తప్పా రాజకీయం చేయలేదన్నారు. పార్టీల పరంగా ఏమైనా ఉంటే బయట రాజకీయం చేసుకోవాలే తప్పా వనదేవతల పేరుతో రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పూజారులు కొక్కెర రమేష్, చందా రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
భక్తులను అవమాన పరిచారని ఫిర్యాదు
కాళేశ్వరం: కాళేశ్వరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవమానం జరగొద్దని ఈఓకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటులో హైదరాబాద్‌కు చెందిన సందీప్ తన తండ్రి అస్తికలు కలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. బుధవారం అస్తికలు గోదావరిలో కలిపి తీరంపైకి రాగానే అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తారా.. అంటూ తమను బూతులు తిడుతూ అవమాన పరిచారని ఫిర్యాదు చేసినట్లు సందీప్ తెలిపారు. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదని దేవాదాయశాఖ సూచిక బోర్డులు అమర్చలేదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి అవమానం ఎవరికీ జరగకుండా దేవాదాయశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ
మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వృత్తివిద్య ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జి.వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.


