కాంగ్రెస్ గ్యారంటీలపై ఓటర్లు నిలదీయాలి
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఓటర్లు నిలదీయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జ్ సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీపడిన పథకాల వివరాలతో కూడిన బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు బాకీ కార్డులను ప్రజలకు అందించి వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి, ములుగు, మల్లంపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్‌రెడ్డి, పాలెపు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గోవింద్‌నాయక్, ప్రదీప్‌రావు, వేములపల్లి భిక్షపతి, కాకి పురుషోత్తం, అమర్‌సింగ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్


