ఎవరి వ్యూహం వారిదే..!
జనగామ జనగామ 186 00 186
ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మున్సిపల్ పోరు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పట్టణాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ, విపక్ష పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లా.. మున్సిపాలిటీ.. అక్కడి రాజకీయ వెసులుబాటును బట్టి సీపీఐ, సీపీఎం తదితర పార్టీల మద్దతును కూడగట్టుకునేందుకు ఆ పార్టీల నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బల్దియాలలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సోమవారం నాటికి చాలా మున్సిపాలిటీల్లో ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వార్డుల వారిగా బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. నామినేషన్‌ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో ఉదయమే ‘బి’ ఫామ్‌లు ఇచ్చేలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి.
అన్ని పార్టీలకు రెబల్స్ బెడద.. బుజ్జగింపుల తర్వాతే ‘బీ’ఫామ్స్...
ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు అభ్యర్థులు 2,372 నామినేషన్‌లు దాఖలయ్యాయి. నామినేషన్‌ల పరిశీలనలో 300లు తిరస్కరణకు గురికాగా 2,072 మంది బరిలో ఉన్నారు. సగటున చూస్తే ఒక్కో వార్డు నుంచి 9 నుంచి 10 నామినేషన్‌లు దాఖలు కాగా.. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రెబల్స్ బెడద అధికంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి రెబల్స్ బెడద ఉండకుండా చూడాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు ముఖ్యనేతలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో రెండు రోజులుగా మంతనాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌లపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన ప్రజాప్రతినిధులు అందుకు అనుగుణంగా రిజర్వేషన్‌లను బట్టి వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, తొర్రూరు తదితర మున్సిపాలిటీలలో బరి నుంచి సుమారు 117 మంది వరకు తప్పుకున్నట్లు సమాచారం. కాగా అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా బరిలో ఉండే అభ్యర్థుల ‘బీ’ఫామ్‌లు సమర్పించాల్సి ఉండగా అంతకు ముందే రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పరకాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌నుంచి 22 వార్డుల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు.
‘పుర’ పీఠం లక్ష్యంగా పార్టీల వ్యూహం..
నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడమే తరువాయి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత అందరూ కూడా పార్టీ గుర్తుపై పోటీ చేసేవారి గెలుపునకు కృషి చేసేలా వార్డుల వారీగా బృందాలను నియమిస్తున్నారు. వరుస విజయాలు, అభివద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్‌తో బీఆర్‌ఎస్, బీజేపీలున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్‌సైజు చేశాయి. ఇదిలా వుండగా మొత్తం 12 మున్సిపాలిటీల్లో 335244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 172087లు కాగా, పురుషులు 163088లు ఉన్నారు. అత్యధికంగా మహిళలే ఉండటంతో వార్డులు, మున్సిపాలిటీల వారిగా అత్యధికంగా వారి ఓట్లను పొందేందుకు కూడా పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
జిల్లా మున్సిపాలిటీ దాఖలైన తిరస్కరించిన మిగిలినవి
నామినేషన్లు నామినేషన్లు నామినేషన్లు
భూపాలపల్లి భూపాలపల్లి 230 64 166
ములుగు ములుగు 192 16 176
హనుమకొండ పరకాల 215 02 213
వరంగల్ నర్సంపేట 291 00 291
వర్థన్నపేట 121 00 121
స్టేషన్‌ఘన్‌పూర్ 181 00 181
మహబూబాబాద్ మహబూబాబాద్ 357 127 230
డోర్నకల్ 146 44 102
కేసముద్రం 167 44 123
మరిపెడ 142 03 139
తొర్రూరు 144 00 144
మొత్తం 2,372 300 2,072
నామినేషన్‌ల పరిశీలన రోజు నాటికి అయా మున్సిపాలిటీల్లో దాఖలైన
నామినేషన్లు, తిరస్కరించినవి, మిగిలినవి
260 వార్డులకు 2372 నామినేషన్లు... తిరస్కరణ తర్వాత 2072
పోటాపోటీగా నామినేషన్‌లు..
అన్ని పార్టీల నుంచి రెబల్స్
పరకాలలో బీఆర్‌ఎస్‌నుంచి
వార్డు అభ్యర్థుల ప్రకటన..
నేడు నామినేషన్‌ల ఉపసంహరణ..
ఎవరి వ్యూహం వారిదే..!


