
రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్‌పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్‌గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.

అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?
గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు.