వేలాల జాతరకు వేళాయె..
భక్తుల కొంగు బంగారంగా మల్లన్న స్వామి
నేటి నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు
ముస్తాబైన ఆలయం
మహిమాన్విత క్షేత్రం ‘బుగ్గ’
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: మండలంలోని కన్నాల గ్రామ శివారులో ఉన్న బుగ్గ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా పేరొందింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే జాతరకు ఆలయం ముస్తాబైంది. లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బారికేడ్లతో క్యూ లైన్లు నిర్మించారు. ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజాభజంత్రీలతో పాలపొరకను ఎదుర్కొని పచ్చని పందిరి వేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున ప్రత్యేక పూజల తర్వాత స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 10గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఆల య పరిసరాల్లో జాగారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరునాడు ఆలయ పరిసరాల్లోనే వంటలు వండి ఇప్ప ఆకుల్లో శివునికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.
జైపూర్: ఉత్తర తెలంగాణలో మరో కొమురవెల్లి మల్లన్నగా వెలుగొందుతున్న వేలాల మల్లన్న స్వామి జాతరకు వేళయింది. ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించే జాతరకు ఆలయం ముస్తాబైంది. జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గోదావరి తీర ప్రాంతంలో 200 ఏళ్ల క్రితం మల్లన్న స్వామి స్వయంభూగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. దొణలో స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని పూజిస్తూ గ్రామంలో ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రికి వైభవంగా జాతర నిర్వహిస్తారు. యాదవుల ఆరాధ్యదైవమైన మల్లికార్జున స్వామికి ఒగ్గు పూజారులు సంప్రదాయంగా పట్నాలు వేసి, బోనాలు పోసి పూజలు నిర్వహిస్తారు. కొరిన కోర్కేలు తీర్చే దైవంగా పేరొందిన మల్లన్న స్వామి వద్ద జరిగే జాతరకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని సిరోంచ, గడ్చిరోలితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. సుమా రు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేశారు. గుట్టపైన, కింద చలువ పందిళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గుట్టపైన, కింద రూ.50 ప్రత్యేక దర్శనం, రూ.100తో సుల భ దర్శన సౌకర్యం కల్పించారు. గ్రామ శివారులో పార్కింగ్, గుట్ట కింది వరకు వీఐపీ వాహనాలు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించారు.
బ్రహ్మణులు పూజలు చేపడుతున్నా ఒగ్గు పూజాలు వారి సంప్రదాయబద్దంగా పెద్దపట్నం వేసి మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం, నాగవెల్లి జరిపిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఒగ్గు పూజారులతో పసుపు, కుంకుమ, కుడక, రైకబట్టతో మల్లన్న స్వామికి పట్నాలు వేసి పట్టువస్త్రా లు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.
గట్టు మల్లన్నస్వామి చెలిమె నీటికి ప్రత్యేకత ఉంది. ఎత్తయిన గుట్టపై దొణలో శివలింగం ఉండి ఆ పక్కనే ఊట చెలిమె ఉంటుంది. చెలిమెలో అన్ని కాలాల్లో నీరుంటుంది. మలన్నస్వామిని దర్శించుకున్న భక్తులు నీటిని తీర్థంగా స్వీకరిస్తారు. శారీరక రుగ్మతలు తొలిగిపోతాయని, పొలాల్లో చల్లుకుంటే పంటలు సంవృద్ధిగా పండుతాయని, ఇంట్లో చల్లుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
జాతరలో తొలి రోజున గుట్టపై దొణలో గట్టు మల్లన్నస్వామికి భక్తులు మొక్కులు చెల్లిస్తారు. బోనాలు పోసి, పట్నాలు వేసి రాత్రంతా జాగారం చేస్తారు. వేదపండితులు, ఒగ్గు పూజారులు సంప్రదాయబద్దంగా మల్లికార్జునస్వామి భ్రమరాంభికలకు పట్నం వేసి వైభవోపేతంగా కల్యాణం జరిపిస్తారు. మరుసటి రోజు వేలాల గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద జాతర సాగుతుంది. భక్తులు గుట్టపై నుంచి కిందకు చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మళ్లీ స్వామికి మొక్కులు చెల్లించి బోనాలు పోస్తారు. మూడో రోజు జాతర ముగుస్తుంది.
భారీ బందోబస్తు
జాతరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ వెల్లడించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తోపాటు ముగ్గురు ఏసీపీలు, 10మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 400 మంది పోలీసు సిబ్బందితో ఐదు రూట్లుగా బందోబస్తు నిర్వహిస్తారు. ప్రధాన ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థలను పటిష్టం చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వేలాలకు 100ఆర్టీసీ బస్సులు కేటాయించారు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వేలాలకు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తెలిపారు.
పూజల్లోనూ ప్రత్యేకమే..
ఊట చెలిమె నీరే తీర్థం
వైభవంగా కల్యాణం
వేలాల జాతరకు వేళాయె..
వేలాల జాతరకు వేళాయె..


