● బెల్లంపల్లిలో మ్యాజిక్ ఫిగర్ లేక మంతనాలు ● మంచిర్యా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుర పీఠాలపై పీటముడి వీడడం లేదు. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బెల్లంపల్లిలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో హంగ్ కారణంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. మెజార్టీ స్థానాలు ఎవరికి దక్కితే వారికే అవకాశం ఉంది. ఇక మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిలో లక్సెట్టిపేట మున్సిపాల్టీలో ఎన్నికలకు ముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా చెన్నూర్‌లో పెద్దింటి పద్మను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక బీఆర్‌ఎస్, సీపీఐ పొత్తుతో మున్సిపల్ పీఠం దక్కించుకున్న క్యాతనపల్లిలో గొడిసెల సంధ్యారాణికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓట్లతోనూ..
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు తమ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా ఎక్స్ అఫీషియో కోటాలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. చైర్‌పర్సన్ అభ్యర్థుల ఎంపిక సమయంలో స్పష్టమైన మెజార్టీ రాకపోతే ప్రజాప్రతినిధుల ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. జిల్లాలో బెల్లంపల్లిలో మాత్రమే హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఓటు కీలకంగా మారింది. ఆయనకు పట్టణంలో ఓటు హక్కు లేనప్పటికీ ఎక్స్ అఫీషియో ఓటు చైర్‌పర్సన్ ఎంపికలో కాంగ్రెస్ పార్టీకి మేలు చేయనుంది. ప్రస్తుతం స్వతంత్రులను పోటాపోటీగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఓటు ప్రాధాన్యత కలిగి ఉండనుంది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల కార్పొరేషన్‌లో ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది.
కాపు వర్గం నుంచే మేయర్..?
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నేతృత్వంలో 60 డివిజన్లలో 44చోట్ల విజయ ఢంకా మోగించడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక సునాయాసంగా మారింది. ఇక మేయర్ ఎవరవుతారనేది ఆసక్తి రేపుతోంది. బీసీ జనరల్ కావడంతో నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్న కాపుల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కలిసొచ్చిన వారి ప్రకారం పార్టీలో సీనియర్, జూనియర్లు, యువతతోపాటు మహిళలు ఆశిస్తున్నారు. అయితే ఎవరు పీఠం అధిష్టిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఎవరి పేరు వెల్లడించనప్పటికీ నలుగురైదుగురి పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. వీరిలో 14డివిజన్ నుంచి తూముల నరేశ్, 32నుంచి దర్ని మధూకర్, 46నుంచి పెంట రజిత, 54నుంచి సల్ల రమ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్లు సైతం పదవి ఆశిస్తున్నారు.
● బెల్లంపల్లిలో మ్యాజిక్ ఫిగర్ లేక మంతనాలు ● మంచిర్యా


