ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు
తాండూర్: ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా మహిళలు ముందుకు సాగాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మవిజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియా మాదారంటౌన్‌షిప్‌లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మగ్గం, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులను ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ శిక్షణ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తెలిపారు. ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్‌కుమార్, పర్సనల్ హెచ్‌ఓడీ ఎం.శ్రీనివాస్, శిక్షకులు పాల్గొన్నారు.


