పట్టు నిలబెట్టుకున్న పీఎస్సార్
● సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు ● స్వల్ప తేడాతో కొన్ని స్థానాల్లో ఓటమి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) పట్టు నిలబెట్టుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా మంచిర్యాల కార్పొరేషన్, లక్సెట్టిపేట మున్సిపాల్టీలో పార్టీ అభ్యర్థుల ఎంపిక సర్వే నిర్వహించారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వడంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మంచిర్యాల నగరంలోని డివిజన్లలో విజయం సాధించేలా పది డివిజన్లకు ఒక చోట కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సమయం తక్కువగా ఉన్నా తనను నమ్మి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చేసి చూపిస్తానని ఇచ్చిన హామీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 44 డివిజన్లలో గెలుపొంది పూర్తి మెజార్టీతో తొలి కార్పొరేషన్‌లో అధికారాన్ని కై వసం చేసుకుంది. ఓడిన స్థానాల్లో అతి తక్కువ ఓట్లతోనే కావడం గమనార్హం. లక్సెట్టిపేటలోనూ ప్రచారం నిర్వహించి అధికారాన్ని దక్కించుకున్నారు.


