‘పెద్దింటి’కే చైర్‌పర్సన్ పీఠం?
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం పెద్దింటి పద్మకే దక్కనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వు అయింది. మున్సిపాల్టీలో 18వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకే చైర్‌పర్సన్ స్థానం దక్కనుంది. ఆ పార్టీ నాయకుడు పెద్దింటి శ్రీనివాస్‌కు సౌమ్ముడిగా పేరుంది. మంత్రి వివేక్‌వెంకటస్వామికి నమ్మినబంటుగా ఉన్నారు. దీంతో శ్రీనివాస్ భార్య, రెండో వార్డు నుంచి గెలుపొందిన పద్మను చైర్‌పర్సన్‌గా ఖరారు చేసినట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన పద్మకు చైర్‌పర్సన్ పీఠం దక్కడ ఖాయమని తెలుస్తోంది.
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా..
అధిష్టానం అవకాశం ఇస్తే చెన్నూర్ మున్సిపాలిటీని మంత్రి వివేక్ వెంకటస్వామి సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. మంత్రి ఇప్పటికే చెన్నూర్ మున్సిపాలిటీలో రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాపై నమ్మకంతో 2వ వార్డు అభ్యర్థిగా అవకాశం కల్పించారు. చైర్‌పర్సన్‌గా నియమిస్తూ మంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తా.
– పెద్దింటి పద్మ, 2వ వార్డు కౌన్సిలర్


