మూడంచెల భద్రత
మంచిర్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, సంబరాలు, సమవేశాలు, డీజే సౌండ్స్‌పై నిషేధం విధించినట్లు తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెటిపేట, క్యాతనపల్లి కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు 100 మీటర్ల పరిధిలో వెలుపలి రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనధికార వాహనాలు, వ్యక్తులకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, లైటర్లు, మొబైల్ ఫోన్లు, అగ్గిపెట్టెలకు అనుమతి లేదని, అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 33మంది సీఐలు, 96మంది ఎస్సైలు, 149మంది ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, 518మంది కానిస్టేబుళ్లు, 263మంది స్పెషల్ ఫోర్స్ బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు.


