కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా!
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా కొనసాగుతోందని, యూనియన్ల ద్వితీయశ్రేణి నాయకులు అధికారులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఈ నెల 10న ఇద్దరు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ గని అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని పలుమార్లు పత్రికల్లో రావడం, స్థానికంగా వివాదంగా మారినప్పటికీ అధికారుల్లో ఎటువంటి మార్పులు రావడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి సింగరేణిలో సర్ఫేస్ (గనిపైన) విధులు కేటాయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం డబ్బులు పెడితే ఎవరికై నా ఇవ్వడం సర్వసాధారణంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తులు కార్మికులతో కలిసి మీకు సర్ఫేస్‌లో పని కేటాయించాలంటే గని అధికారులతో నేను మాట్లాడుతా డబ్బులు ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసి విధులు కేటాయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సర్పేస్‌లో పనికి రూ.50 వేల వరకు మ్యాన్‌రైడింగ్ విధులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకోవడం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా షిప్ట్ మార్పులు, జనరల్ షిప్ట్ విధులు, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, విభాగంలో విధులు కేటాయింపు.. ఇలా అన్నింటికీ డబ్బుతో ముడిపడి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. సీనియర్ కార్మికులు అనారోగ్యంతో ఉన్నవారు, అన్‌ఫిట్ స్థితిలో ఉన్న ఉద్యోగులకు ఇక్కడ అవకాశం లేదని, మ్యాన్‌రైడింగ్ వద్ద జనరల్ మజ్దూర్ చేతకాని కార్మికులను పెట్టాల్సి ఉండగా నూతనంగా వచ్చిన యువకులకు అవకాశం ఇవ్వడం ఇందుకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా సర్ఫేస్‌లో పనిచేసే జనరల్ మజ్దూర్‌లను కాదని అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే వారికి సర్పేస్‌లో విధులు అప్పగించి అండర్‌గ్రౌండ్ అలవెన్స్‌లు కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని వాపోతున్నారు.
ప్రమోషన్ల పేరిట డబ్బులు వసూలు
ప్రమోషన్‌లు వచ్చిన కార్మికుల నుంచి సైతం డబ్బులు ఇవ్వకుంటే వేరే వారికి పోతాయని, సర్ఫేస్‌లో విధులు ఇచ్చి ప్రమోషన్ రావడానికి కారణం మేమే అంటూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల గని అధికారి ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి సదరు ఏజెంట్లు మేకలు, మందు, ఇతర ఖర్చులు అంటూ సర్ఫేస్ వారి వద్ద, ఇతర కార్మికుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంతో పాటు ఓవర్‌మెన్ స్థాయి సూ పర్‌వైజర్లు సైతం సదరు అధికారి పేరు చెప్పి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల దందా అధికం కావడంతో పాటు కొందరు మస్టర్లు పడి వెళ్లిపోయిన సంఘటనపై విజిలెన్స్‌కు సమాచారం అందడంతో సదరు ఉద్యోగులను తీసుకెళ్లి ప్రశ్నించడంతో పాటు పూర్తి విచారణకు దిగినట్లు తెలిసింది. కాగా గతంలో సదరు అధికారి పుట్టిన రోజు వేడుకలు ఒకచోట నిర్వహించి వేడుకల ఖ ర్చు, బంగారం కానుక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్ర స్తుతం మళ్లీ పునరావృతం కావడంతో అధికారులు, యూనియన్ నాయకులు ఒక్కటయ్యాక చేసేదేముంది.. అని విమర్శలు ఉన్నాయి. గనిలో దెబ్బలు తాకిన కార్మికులకు రిపోర్ట్ రాయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించి మస్టర్లు వే యడం, స్వల్ప గాయాలకు పాల్పడిన వారికి మ స్టర్లు వేసి పైన ఉంచడంలాంటి కార్యకలాపాలు పూ ర్తిస్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి విధుల కేటాయింపులో సీని యర్‌లకు, అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


