కూలీ పనికి వచ్చి తిరిగిరాని లోకాలకు...
జైపూర్: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన తూర్పాటి అభి (19), పెంబట్లకు చెందిన పురాణం రవి, పస్తం అరుణ్ ముగ్గురూ స్నేహితులు. చెన్నూర్‌లో పత్తి లోడింగ్ చేసేందుకు ఈనెల 11న ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై కూలీ పనికి వచ్చారు. రాత్రంతా పనిచేసిన యువకులు గురువారం తెల్లవారుజామున లక్సెట్టిపేటకు బయలుదేరారు. రసూల్‌పల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. అభి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి, అరుణ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. అభి తండ్రి తూర్పాటి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


