వరుస చోరీల గజదొంగ అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసచోరీ కేసులను ఛేదించినట్లు పేర్కొన్నారు. 7 కేసులు నమోదు కాగా గజదొంగను పట్టుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామ పంచాయతీ నాగాపూర్‌కు చెందిన టేకం రామారావుపై ఇప్పటి వరకు 36 కేసులు నమోదైనట్లు చెప్పారు. కరీంనగర్, సిద్ధిపేటలో దొంగతనాలకు పాల్పడినందుకు రెండేళ్ల జైలుశిక్ష అనుభవించినట్లు తెలిపారు. జనవరి 6న విడుదలకాగా ఉట్నూర్ మండలంలోని పలు ఇళ్లల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఉట్నూర్‌కు వచ్చి ఊరు శివారులో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. గురువారం దొంగిలించిన బంగారం, వెండి, ఇతర సామగ్రితో మంచిర్యాల వైపు వెళ్తుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద పట్టుకుని అతని వద్ద 11.4 తులాల బంగారు, 20 తులాల వెండీ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.


