అయ్యా.. నాకొడుకులు సాత్తలేరు
● పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు
తిర్యాణి: నవమోసాలు మోసి కని పెంచిన కొడుకులు వృద్ధాప్యంతో తనను పట్టించుకోవడంలేదని ఓ వృద్ధురాలు బుధవారం స్థానిక పోలీసులను ఆశ్రయించిది. వివరాలు ఇలా ఉన్నాయి. నాయకపుగూడకు చెందిన ముత్తె గంగవ్వకు ముగ్గురు కుమారులు సంతానం. భర్త పోషమల్లు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. కొన్నిరోజుల పాటు కొడుకుల ఇళ్లలో ఉన్న గంగవ్వను ఇటీవల వెల్లగొట్టడంతో సమీపంలోని వ్యవసాయభూమిలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ నేపధ్యంలో గుడిసెకు సంబంధించిన భూమి కూడా తమదేనంటూ కూలగొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పోలీసులే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వర్క్‌షాపులో చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి వర్క్‌షాప్‌లో నిలువ చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కొన్ని రోజులుగా కాపర్ వైరు చోరీ జరుగుతున్న విషయం బుధవారం వెలుగుచూసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లలో వినియోగించిన ట్రాన్స్‌ఫార్మర్లను ఏరియా వర్క్‌షాపుల్లో నిలువ ఉంచుతారు. కొందరు దుండగులు బాక్స్‌లను తెరిచి అందులోని కాపర్ దొంగిలించి తిరిగి బాక్సుల కవర్లు బిగించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో అధికారులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన కాపర్ విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవిని వివరణ కోరగా చోరీ జరిగిన విషయంపై సీసీ ఫుటేజీ ద్వారా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
మందమర్రిరూరల్: పట్టణానికి చెందిన వివాహిత హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మందమర్రి పట్టణంలోని శ్రీపతినగర్‌కు చెందిన పొన్నం శ్రావణి (28)కి అదేకాలనీకి చెందిన రంజిత్‌తో ఇటీవలే వివాహమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రావణి ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. రంజిత్ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. బుధవారం శ్రావణి గడ్డిమందు తాగడంతో గమనించిన హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


