ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చే సుకుంది. ఎస్సై ఇ.సాయన్న తెలిపిన వివరాల మేరకు దొడందా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చౌమాన్ హీరా లాల్ (28)కు రెండేళ్ల క్రితం కడెం మండలంలోని అల్లంపల్లి బాబానాయక్‌తాండకు చెందిన రాథోడ్ సరస్వతితో వివాహమైంది. కొంతకాలంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, తల్లితో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లి ఒక్కడే ఇంటికి వచ్చాడు. సోమవా రం తల్లి సుందబాయి పింఛన్ డబ్బుల కోసం న ర్సాపూర్ వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరు..
కాసిపేట: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ రాంపూర్‌కు చెందిన తోటపల్లి శంకర్ (50) కూలీపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి అరగంట తర్వాత ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని పడుకున్నాడు. 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంతపిలిచినా తలుపులు తీయకపోవడంతో గడ్డపార సాయంతో తొలగించి చూడగా దూలానికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. మద్యం మానలేక, పనిచేయలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని భార్య దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగారంతెలిపారు.
కొడుకు మరణం తట్టుకోలేక తల్లి..
కెరమెరి: కొడుకు మరణం జీర్ణించుకోలేక మనోవేదనతో తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మగూడకు చెందిన చౌహాన్ అరవింద్ ఆర్నెళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి చౌహాన్ సుమత్రబాయి మనోవేదనకు గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. పొలం పనులకు వెళ్లిన భర్త గోవింద్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా మంచంపై విగతజీవిగా పడిఉంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సుధాకర్ తెలిపారు.
కుల బహిష్కరణకు పాల్పడ్డారని ఫిర్యాదు
కాగజ్‌నగర్(బెజ్జూర్): బెజ్జూర్ మండలంలోని చిన్న సిద్దాపూర్‌కు చెందిన టాకిరే వెంకటేష్ అనే దివ్యాంగుడు తన కుటుంబంపై కుల బహిష్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సర్తాజ్‌పాషా తెలిపారు. కిరాణా దుకాణం నిర్వహిస్తున్న వెంకటేష్ కుటుంబ పోషణ భారంగా ఉండటంతో మద్యం కూడా విక్రయిస్తున్నాడు. మద్యం విక్రయాలు నిర్వహించరాదని ఇటీవల గ్రామంలో దండోరా వేయించారు. అయినప్పటికీ ఆదివారం మళ్లీ మద్యం విక్రయించాడన్న కారణంతో సోమవారం కుల బహిష్కరణ చేయాలంటూ దండోరా వేయించినట్లు తెలిపాడు. ఎవరైనా అతని దుకాణానికి వస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నాడు. దీనిపై బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌తో పాటు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


