కలమడుగు వాసికి గోల్డ్‌మెడల్
జన్నారం: మండలంలోని కలమడుగుకు చెందిన బొంతల మధుకర్ పీహెచ్‌డీ పట్టాతో పాటు గోల్డ్‌మెడల్ సాధించాడు. గ్రామ సర్పంచ్ బొంతల నాగమణి, మల్లేష్ దంపతుల కుమారుడు మధుకర్ హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో మొక్కజొన్న పంటలో డ్రోన్ ద్వారా గడ్డిమందును చల్లే విధానంపై పరిశోధనలు చేశారు. పరిశోధన విజయవంతం కావడంతో సోమవారం యూనివర్సిటీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో యూఎస్‌ఏ కార్నల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రభు ఎల్.పింగళి, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాతో పాటు గోల్డ్‌మెడల్ అందుకున్నాడు.
తీవ్రమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం
ఖానాపూర్: ఖానాపూర్‌లో ఏర్పాటు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్‌కు తరలించారంటూ ఇంటిగ్రేటెడ్ సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించామని జేఏసీ, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, స్థలం లేకే స్కూల్ ఏర్పాటు కాలేదని, దీనిపై ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో జేఏసీ నాయకులు తాము సైతం ప్రమాణం చేస్తామంటూ సోమవారం స్థానిక ముత్యాల పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎమ్మెల్యే రాకపోవడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తనస్థాయికి తగ్గ వ్యక్తులు కానప్పటికీ వారు వస్తే సవాల్ స్వీకరిస్తానని అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బొజ్జు ప్రకటించారు.
కలమడుగు వాసికి గోల్డ్‌మెడల్


