ఒకే ఇంట్లో ముగ్గురు కౌన్సిలర్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఓ మామ..ఓ కొడుకు..ఓ కోడలు ఇలా ‘గరిగంటి’కుటుంబానికి చెందిన ముగ్గురు మంచిర్యాల పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా గెలుస్తూ వస్తున్నారు. గత 35 ఏళ్లుగా విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఓటర్లు వరుసగా ఒకే కుటుంబంలో ముగ్గురిని గెలిపించి ఆ కుటుంబానికి అధికారం కట్టబెడుతున్నారు. గరిగంటి కనకయ్య 1987లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 13వ వార్డు(మొన్నటి వరకు 24 వార్డు) కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఐదేళ్లపాటు కౌన్సిలర్‌గా పని చేశారు. ఆయన సోదరుడి కుమారుడు గరిగంటి సాయిలు కూడా 1982–87 వరకు కౌన్సిలర్‌గా పని చేశారు.
మూడుసార్లు సరోజ..
సరోజ 1995లో పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించింది. మామ కనకయ్య రాజకీయ వారసురాలిగా గెలిచింది. పాలనలో సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకుని వరుసగా నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై ంది. 2000లో సరోజ పోటీ చేసే వార్డు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఎన్నికలకు దూరమైంది. మళ్లీ 1995, 2005, 2014లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా వ్యవహరించింది. తాజాగా కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో 46వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీలో నిలబడింది.
ఒకేసారి కొమురయ్య..
కనకయ్య తనయుడు గరిగంటి కొ మురయ్య రాజకీయప్రవేశం చేశాడు. సరోజ భర్త కొమురయ్య 2005లో జరిగిన పుర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. 2005లోనే పక్కపక్క వార్డుల రిజర్వేషన్లు కలిసి రావడంతో భార్యాభర్తలు ఇద్దరూ పోటీ చేసి కౌన్సిలర్లుగా ఎన్నికై కౌన్సిల్‌లో అడుగు పెట్టారు. ఆ తర్వాత రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో కొమురయ్య ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.


