స్కాములతో సింగరేణి ప్రైవేటు పరమే..!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం స్కాముల కేంద్రంగా మార్చి రాబోయే కొన్నేళ్లలో ప్రైవేటు పరం చేసే దిశగా నడిపిస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్‌చౌక్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను కుంభకోణాలకు నిలయంగా మార్చిందని ఆరోపించారు. సింగరేణి ఓబీ కాంట్రాక్ట్ టెండర్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, టెండర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. తమ హయాంలో నెలనెలా మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెడికల్ బోర్డులే లేకుండా పోయాయని విమర్శించారు. సింగరేణిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. సింగరేణి పరిరక్షణకు ఏఐటీయూసీ వంటి కార్మిక సంఘాలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
డిపెండెంట్ ఉద్యోగాల ఘనత కేసీఆర్‌దే..
నస్పూర్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన నస్పూర్‌లోని షిర్కే సెంటర్ వద్ద రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అక్రమ కాంట్రాక్టుల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిది సృజన్‌రెడ్డికి వేల కోట్ల రూపాయల సింగరేణి సొమ్మును దోచి పెడుతున్నాడని విమర్శించారు. మంచిర్యాలలో పోలీసులు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వచ్చేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాలలో కూల్చివేతల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఏఐటీయూసీ నేత సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, మూల రాజిరెడ్డి, డాక్టర్ రాజరమేష్, రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కే.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి బూతుపిత
బెల్లంపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి నుంచి మంచి మాటలు రావని, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్న ఆయనను బూతుపిత అని పిలవాలని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉప నేత తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లిలోని బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి రూ.51 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, చెల్లించలేక ఏ అదానికో, అంబానికో వచ్చే రెండేళ్లలో అప్పగిస్తాడని విమర్శించారు. రోడ్డు నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల ఖాతా నుంచి డబ్బులు కాజేసే రేవంత్‌రెడ్డి సైబర్ నేరగాడ ని తీవ్ర విమర్శలు చేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


