రక్తదాతలూ స్పందించండి..
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రధాన ఆస్పత్రిలో ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో గత నెల రోజులుగా రక్తనిల్వలు తగ్గిపోయాయి. దీంతో ప్రతీ పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి చేయించుకునే తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి చేయకుంటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలోని రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో 683మంది సికిల్‌సెల్, 235మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు రిజిష్టరై ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ ద్వారా పదిహేను రోజులకోసారి రక్తమార్పిడి జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారికి సరిపడా గ్రూపు రక్తం అందుబాటులో లేకపోతే దొరికే వరకు ఆగాల్సిందే. వ్యాధిగ్రస్తులను ఆపదలో ఆదుకుంటున్న రక్తనిధి కేంద్రంలో నెల రోజులుగా రక్త నిల్వల కొరత వేధిస్తోంది. రక్తదానానికి దాతలు ముందుకు రాకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఇటీవల సమ్మక్క–సారక్క జాతర ఒక కారణమైతే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించక సేకరణ జరగడం లేదని రక్తనిధి కేంద్రం ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. రక్తనిధి కేంద్రం నుంచే జీజీహెచ్, మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుంటారు. రక్తం అవసరమైన వారు దాతను తీసుకొచ్చి రక్తం ఇచ్చిన తర్వాత బదులుగా తీసుకెళ్తే కొరత కొంతవరకు తీరే అవకాశం ఉంది. కానీ చాలామంది దాతలు లేకుండానే రక్తం అవసరమని ఆస్పత్రుల రికార్డులతో వచ్చి తీసుకెళ్తున్నారు. దీంతో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రతియేటా అక్టోబర్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాల్లో పోలీసులు రక్తదానం చేస్తుంటారు. అప్పుడు వందల యూనిట్ల రక్తం సేకరించి కరీంనగర్, పెద్దపల్లి, కుమురంభీం, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చే తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వాలంటరీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేస్తేగానీ కొరత తీరేలా లేదు. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. శుక్రవారం హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు 20మంది ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేశారు.


