ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కే.గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలసి ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఒక బృందానికి ఒక పీవో, ఎంపీవో, ముగ్గురు ఓపీవోల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68 బృందాలు, చెన్నూరుకు 36 బృందాలు, క్యాతనపల్లికి 45 బృందాలు, లక్సెట్టిపేటకు 30 బృందాలు, మంచిర్యాల నగరపాలక సంస్థకు 265 బృందాలు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించామని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. ఆయా మున్సిపాలిటీ కార్యాలయల్లోని ఏర్పాటు చేశామని, 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


