శ్రీశైలం మల్లన్నకు పట్టువస్త్రాల అందజేత
అమరచింత: అమరచింత పద్మశాలీలు 15 రోజులుగా నిమయ నిష్టలతో మగ్గంపై తయారు చేసిన పట్టువస్త్రాలను శివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావుకు అందించారు. శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్‌లో పట్టణానికి చెందిన మహంకాళి సత్యనారాయణ, మహంకాళి ఎల్లప్ప, శ్రీనివాసులుతోపాటు మరో ఇద్దరు అక్కడే ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకుని మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలు, భ్రమరాంబికదేవికి పట్టుచీరను తయారు చేశారు. ప్రతి సంవత్సరం అమరచింత పద్మశాలీలు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం శివరాత్రికి పట్టువస్త్రాలను తయారు చేసి అప్పగించడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్ అధ్యక్షుడు చిలువరి కాశీనాథ్ పాల్గొన్నారు.


