రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
● ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ఘటన
● మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తింపు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని ఊర్కొండ మండలం తిమ్మనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా కలకేరి మండలం తాళికోట ప్రాంతం నుంచి రెండు క్రూయిజర్లలో సుమారు 20 మంది శ్రీశైలం దైవదర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఊర్కొండ మండలంలోని తిమ్మన్నపల్లి వద్ద జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారి–167పై ఓ క్రూయిజర్ వేగంగా కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి(52), ఆయన భార్య మేఘన(45), మహాదేవి(55) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. రాత్రి గస్తీలో ఉన్న మండల పోలీసులు గమనించి ఓ లారీ డ్రైవర్ సహాయంతో వాహనంలో ఇరుక్కున్న వారి మృతదేహాలు, క్షతగాత్రులను బయటికి తీశారు. అనంతరం క్షతగాత్రులను వెల్దండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణదేవ తెలిపారు.
తల్లి, ఇద్దరు పిల్లలు
మిస్సింగ్.. కేసు నమోదు
గోపాల్‌పేట: వివాహిత, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కాగా ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జగన్‌మోహన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మండలకేంద్రానికి చెందిన ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు ఒకకూతురు యాదమ్మ ఉండగా ఆరేళ్లక్రితం యాదమ్మకు పెద్దకొత్తపల్లికి చెందిన రామకృష్ణతో పెళ్లిచేశారు. వీరికి పాప, బాబు ఉన్నారు. 20రోజుల క్రితం బోనాలపండుగ కోసం ఈశ్వరమ్మ తన కూ తురు యాదమ్మ, ఐదేళ్ల మనుమరాలు మనీషా, మూడేళ్ల మనుమడు కన్నయ్యను పెద్దకొత్తపల్లి నుంచి గోపాల్‌పేటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ నెల ఏడున తి రిగి తన అత్త గారింటికి వెళ్తున్నాను చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు అత్తవారింటికి వెళ్లలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వివరించారు.


