ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు

Feb 13 2026 3:58 AM | Updated on Feb 13 2026 3:58 AM

ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు

ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు

అధికారిక కవర్‌లో లేకుంటే తిరస్కరణ

మొత్తం వీడియో చిత్రీకరణ

కల్వకుర్తి టౌన్‌: కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత రిటర్నింగ్‌ అధికారి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు చేపడతారు. అరగంట వెసులుబాటు అనంతరం ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభిస్తారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. సహాయ రిటర్నింగ్‌ అధికారి సహకారంతో రిటర్నింగ్‌ అధికారి బాధ్యత వహిస్తారు.

● ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం, ఫారం–13బి లోపల ఉంచిన కవర్‌లో ఉంటుంది. ఈ కవర్‌, ఫారం–13ఏలో ఎలక్టర్‌ చేసిన డిక్లరేషన్‌తో పాటు మరో పెద్ద కవర్‌లో ఉంటుంది. ఈ పెద్ద కవర్‌ ఫారం–13సిలో ఉండి రిటర్నింగ్‌ అధికారి చిరునామాపై ఉండాలి.

● లెక్కింపు ప్రారంభానికి అనగా ఉదయం 8 తర్వాత వచ్చే ఏ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రం కలిగిన ఫారం–13సి కవర్‌ను రిటర్నింగ్‌ అధికారి తెరవరు. ఫారం–13సిలో ఉన్న పై కవర్‌ మీద నోట్‌ రాస్తారు. ఈ కవర్లలోని ఓట్లను లెక్కించటం జరగదు. అలాంటి కవర్లన్నింటిని ఓ ప్యాకెట్‌గా చేసి సీలు చేస్తారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు, కవర్లు అన్ని సరిచూసిన తర్వాతే రిటర్నింగ్‌ అధికారి దాని చెల్లుబాటును నిర్ణయిస్తారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌పై ఓటు నమోదు కాని పక్షంలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు నమోదు చేసినా, తప్పు బ్యాలెట్‌ పేపర్‌ అయినా, బ్యాలెట్‌ పత్రం పూర్తిగా చిరిగిపోయినా, ఎలక్టర్‌కు పంపిన కవర్‌లో దాన్ని తిరిగి పంపకపోయినా, నమోదు చేసిన గుర్తు ఏ అభ్యర్థికి ఓటువేశారో నిర్ధారణ కాకుండా సందేహం కలిగించే విధంగా ఉన్నా, ఓటరును గుర్తించే ఏ గుర్తుగాని, రాతగాని బ్యాలెట్‌ పత్రం రాసి ఉంటే చెల్లని ఓటుగా తిరస్కరిస్తారు.

● చెల్లని ఓట్లను, ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి ఫారం–20లో ఫలితం నమోదు చేస్తారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపైనే అభ్యర్థి గెలుపు నిర్ధారితమయ్యే సందర్భంలో రిటర్నింగ్‌ అధికారి అనివార్యంగా వాటిని మళ్లీ ధ్రువీకరణ జరిపి ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింపబడిన ఓట్లను మరోసారి పరిశీలించి సంఖ్య సరిపోయిందా లేదా చూసి ఫలితానికి తుది రూపం ఇస్తారు.

● మళ్లీ లెక్కింపు జరిగినప్పుడు రహస్య భగ్నం కాని విధంగా మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు. దాని సీడీ, క్యాసెట్‌ను భద్రపరుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement