విద్యుదాఘాతంతో యువకుడి మృతి
అడ్డాకుల: వివాహం నిశ్చయం కావడంతో పెళ్లి పనుల్లో భాగంగా ఇంటికి మరమ్మతులు చేయిస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికై గురై యువకుడు మృతి చెందిన ఘటన మూసాపేట మండలం పోల్కంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జామ్ పాపమ్మ, చిన్న వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వెంకటయ్య మృతి చెందగా కుటుంబ బాధ్యతలను ప్రైవేటులో ఉద్యోగం చేసే కుమారుడు జామ్ రవికుమార్‌యాదవ్ చూస్తున్నాడు. ఇటీవల రవికుమార్‌కు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల పెళ్లి కూడా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంటిలో మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంట్లో ప్లోరింగ్ వేయిస్తున్నారు. ఇందుకోసం క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన తల్లి చుట్టుపక్కల వారి సాయంతో కుమారుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లి చేసుకోవాల్సిన ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి రోదనలు అందరినీ కలచి వేశాయి. తల్లి పాపమ్మ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్ కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి రామాంజనేయులు (33) సోమవారం రాత్రి తోళ్ల మడుగు సమీపంలో జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్ర రక్తగాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య గోవిందమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం రంగాపురం శివారులో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామని.. మరిన్ని వివరాలకు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.


