‘బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయపెడుతున్నారు’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని భయపెడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను కొట్టడం, బెదిరించడం, ఇళ్ల మీదకు వెళ్లి కుటుంబ సభ్యులను హెచ్చరించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీకి సంబంధించి అభ్యర్థి స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తామని ముందుకు వచ్చిన అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి అరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను ఎన్నికల కమిషన్ చేతిలో లేకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుకుకుంటున్నారని, ఇలాంటి వారిపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు పంపించామన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో మంచి పేరు ఉండేదని, దానికి కొందరు అధికారుల తీరుతో చెడ్డపేరు వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉండటం దారుణమన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో కొట్లాడుతూ ఇక్కడ కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు బెక్కం జనార్దన్, మనోహర్, కరుణాకర్‌గౌడ్, స్వదేశ్, మురళి, ఉమామహేశ్వరి, రవిప్రకాష్, శ్రీహరి, రామనాథ్‌గౌడ్, శ్రీరామ్‌కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


