తెలంగాణలో పోటీ చేసేందుకు సిగ్గుండాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజలది నరదిష్టి అన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పార్టీ జనసేన నుంచి మున్సిపల్ ఎన్నికల్లో నిలబడేవారికి సిగ్గుండాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఒక యాక్టర్ అని, ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారని ఎద్దేవా చేశారు. 2019లో ప్రొడ్యూసర్ లేకుండా ఎన్నికల్లో పోయిండు.. ఒక్క సీటు గెలవలేదన్నారు. 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబును, కో–ప్రొడ్యూసర్ లోకేష్‌ను మెచ్చుకొని గెలిచిండు, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మోదీ సహాయంతో తెలంగాణకు రావాలని చూస్తున్నాడని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రోళ్ల కన్ను తెలంగాణపై పడిందని దుయ్యబట్టారు. మన భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రాలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయి, వాళ్లు నరదిష్టి అన్న సరే మనం పడుతున్నాం.. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌తో నీచ రాజకీయాలు
బీఆర్‌ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్‌తో నీచ రాజకీయాలకు పాల్పడ్డారని అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని కేసీఆర్ కూతురు కవితనే చెప్పిందన్నారు. మాజీ మంత్రి పాలనలో ప్రజలకు బయటకు వచ్చి స్వేచ్చగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉండేదన్నారు. మన జిల్లా బిడ్డ సీఎంగా ఉండడం వల్ల జిల్లాకేంద్రంలో రూ.2 వేల కోట్ల శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. బాసర తర్వాత రెండో ఐఐఐటీని ఇక్కడికి తీసుకురావడంలోఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కృషి ఉందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, సీజే బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


