ఓటుకు ఉంది ఓ చరిత్ర
పాలమూరు/కల్వకుర్తి టౌన్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం ఎన్నుకున్న విధానం ఓటు. ఏ భాషలో అయినా అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు అనే పిలుస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు, ఓటర్లు అనే పదాల సాధారణంగా వినిపిస్తున్నాయి. కానీ చాలా మందికి ఓటు అన్న పదానికి అర్థం తెలియదు. ఓటు అన్న పదం ఓటమ్ అనే లాటిన్ ఇంగ్లిష్ భాష నుంచి తీసుకున్నారు. ఓటు అన్న పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి తెలపడం, మద్దతు ఇవ్వడం, అంగీకారం, వాగ్దానం, ఎన్నుకోవడమని అర్థాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి పాలన అధికారాన్ని ఇవ్వడానికి తమ సమ్మతిని తెలపడమని అర్థం. ఓటు వినియోగం క్రీస్తు పూర్వం 139వ సంవత్సరం నుంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. పురాతన గ్రీస్ దేశంలో పగిలిన మట్టిపాత్రల ముక్కలను ఓట్లుగా వినియోగించినట్లు ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు శకం 920లో తమిళనాడు రాష్ట్రంలో అరటి ఆకులను వినియోగించి ఓటుహక్కు ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి ఓట్ల కోసం వినియోగించిన అరటి ఆకులను కుండలో ఉంచి ఎన్నికలు నిర్వహించారు. ఈ పద్ధతిని కూడా ఓలై వ్యవస్థ అని పిలిచారు. అమెరికాలో మొదటిసారిగా కాగితపు బ్యాలెట్లతో మసాచుసెట్స్ చర్చిలో పాస్టర్‌ని ఎంపిక చేసుకోవడం కోసం వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆయా దేశాల రాజ్యాంగాలు పాలనా పరంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు హక్కును కల్పిస్తూ ఓటు అనే ఆయుధాన్ని అందించాయి. 1950 నుంచి మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు తదనంతరం ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది.


