అటవీశాఖ పరిధిలో ఉచ్చుల తొలగింపు
అచ్చంపేట: అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో వన్యప్రాణులను ఉచ్చుల నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది వాటిని తొలగించినట్లు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు. సోమవారం అచ్చంపేట సబ్ డివిజన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక క్యాచ్ ద ట్రాప్ (ఉచ్చులను పట్టుకోవడం) కార్యక్రమాన్ని 2024లో ప్రారంభించడం జరిగిందన్నారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్) స్వచ్ఛంద సంస్థ అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూరు,అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, దోమలపెంట, నాగర్ కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భాగస్వామ్యంతో 3,462 కిలోమీటర్ల నడక మార్గం పరిధిలో 1,076 ఉచ్చులను తొలగించడం జరిగిందన్నారు. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన వాటిని తొలిగించి జంతువులను రక్షించేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోందన్నారు. వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదని, వన్యప్రాణుల సంరక్షణ మన సంరక్షణ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ సుబూర్, సెక్షన్ అధికారి సుజాత, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు అఖిల్ గౌడ్, శ్రీకాంత్, వికాస్, స్నేక్ క్యాచేర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.


