గద్వాల మున్సిపల్ బరిలో.. బంధుగణం
గద్వాల: భార్యాభర్తలు.. అక్కాచెల్లెలు... అత్తాఅల్లుడు.. వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న ఘటనలు గద్వాల మున్సిపల్ ఎన్నికల బరిలో ఆవిష్కృతమైంది. వీరిలో కొందరు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. మరికొందరు ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీకి సిద్ధమై.. ఇంట్లో బంధుత్వాన్ని కొనసాగిస్తూనే.. బయట సవాళ్లు విసురుకుంటున్నారు.
అక్కాచెల్లెళ్లు..
ఒక కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తేనే గొప్ప విషయం. అలాంటిది అక్కాచెల్లెలిద్దరూ వేర్వేరు వార్డుల నుంచి ఒకే పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బండల పద్మావతి పోటీ చేస్తున్నారు. ఈమె 2014 ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది చైర్‌పర్సన్ అయ్యారు. 2020 ఎన్నికల్లో రెండోసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. తాజాగా మూడోసారి మున్సిపల్ ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 34వ వార్డు నుంచి ఆమె సోదరి బండల రామలక్ష్మి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
భార్యాభర్తలు ఇలా..
ఈ సారి ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. 19వ వార్డు నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, 26వ వార్డు నుంచి ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కృష్ణవేణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గద్వాల మున్సిపల్ బరిలో.. బంధుగణం


