ఆంజనేయుడికి బలమొచ్చింది..!
● ఆలయ అభివృద్ధికి రూ.40 లక్షల నగదు, రూ.25 లక్షల భరోసా?
● గుడి చుట్టూ రాజకీయం.. పేటలో హాట్ టాపిక్
● బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా..
నారాయణపేట: అంబపలుకు.. జగదాంబ పలుకు మున్సిపల్ ఎన్నికల పలుకు.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అందరూ చదవి, విని ఆశ్చర్యపోవాల్సిందే మరి. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శ్రీ అంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి మున్సిపల్ పోరులో కాసుల వర్షం కురుస్తోంది. ఆ వార్డు గత రెండు పర్యాయాలు ఎస్సీకి రిజర్వ్ కావడం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సారి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ వార్డుకు డిమాండ్ పెరిగింది. ముందుగా ఆ వార్డులో పోటీ చేసేందుకు ఏవరూ ఆసక్తి చూపలేదు. ఒక అడుగు ముందుకేసి మార్కెట్ మాజీ చైర్మన్ కన్నా జగదీశ్ తన సతీమణి శంకరమ్మను బీఆర్‌ఎస్ తరఫున రంగంలోకి దింపారు. ఆ వార్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడంతో.. బీసీ కాలనీలో ఉన్న కొంతమంది ఓటర్లు ఈ గుడిని ఎవరు అభివృద్ధి చేస్తే వారికి పట్టం కడతామని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తనకు అవకాశం ఇవ్వాలని.. ఆలయం పరిసర ప్రాంతాల ఓటర్లలో కీలకమైన వ్యక్తులతో మాట్లాడి రూ.20 లక్షలు ఇచ్చేందుకు కన్నా జగదీశ్ ఒప్పుకున్నారు. అంతలోనే పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ రాఘవేందర్‌రెడ్డి తన సతీమణి మంజులను సైతం రంగంలోకి దింపారు. ఆయనకు అదే డిమాండ్ పెట్టడం.. రూ.20 లక్షలు ఇవ్వాలని కాలనీవాసులు చెప్పడంతో ఆయన నగదు ఇచ్చినట్లు బహిరంగంగానే వినిపిస్తోంది. ఆ గుడికి ఇద్దరు అభ్యర్థుల ద్వారా రూ.40 లక్షలు రావడంపై అందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంజులను రంగంలోకి దింపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి సైతం తామేమి తక్కువ కాదంటూ మీరు ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ గుడికి రూ.25 లక్షలు దేవాదాయ శాఖ నుంచి ఇప్పిస్తాననంటూ భరోసానిచ్చారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తే అభ్యర్థులను పోటీలో ఉండకుండా ఎన్నికల అధికారులు డిస్‌క్వాలిఫై చేయారా అని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడితో పాటు ఆ వార్డులో ఉన్న మశమ్మ ఆలయానికి సైతం రూ.10 లక్షల చొప్పున బీఆర్‌ఎస్, బీజేపీలు ఇచ్చినట్లు సమాచారం. అభివృద్ధి గురించి కాకుండా ఆలయాల చుట్టూ రాజకీయం జరుగుతుందంటూ పలువురు అంటున్నారు.


