బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసే లేదు
చిప్పగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసే లేదని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు అర్హులైన లబ్ధిదారులకు సరిపడా నిధులు కేటాయించలేదని మండి పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా పాలన సాగిస్తున్నామని చెప్పే సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తామని చెబుతూ విద్యుత్ చార్జీలు అనేక సార్లు పెంచి ప్రజలపై మోయ లేని భారం వేశారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


