శ్రీశైలం భక్తులకు ప్రత్యేక బస్సులు
ఎమ్మిగనూరురూరల్: శివరాత్రి బ్రహ్మో త్సవాల నేపథ్యంలో శైవక్షేత్రాలకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప జోన్–4 రాఘవకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప జోన్ పరిధిలోని 8 జిల్లాల్లో దాదాపు 53 శైవ క్షేత్రాలు ఉన్నాయన్నారు. శ్రీశైలానికి నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి 460 బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. పాదయాత్ర భక్తులను దృష్టిలో ఉంచుకొని నాలుగు రోజుల ముందు నుంచి బస్సు సర్వీసులు పెంచామన్నారు. జిల్లా అధికారుల సలహా, సూచనల మేరకు బస్సు సర్వీసులను తిప్పుతామన్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్రశక్తి బస్సు సేవలను కోస్తా ప్రాంతాలతో పోల్చితే కడప జోన్ పరిధిలో 60 శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు. డిపొల్లో మెకానిక్‌లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సిరి సూచనల మేరకు ఎమ్మిగనూరు బస్టాండ్‌లో సౌకర్యాల కల్పనపై డిపో మేనేజర్‌తో చర్చిస్తామన్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ మద్దిలేటినాయుడు, ఇతర ఆర్టీసీ అధికారులు తదితరులు ఉన్నారు.


