‘సీమ’కు నిధులు పారేనా? | - | Sakshi
Sakshi News home page

‘సీమ’కు నిధులు పారేనా?

Feb 14 2026 8:09 AM | Updated on Feb 14 2026 8:09 AM

‘సీమ’కు నిధులు పారేనా?

‘సీమ’కు నిధులు పారేనా?

పెండింగ్‌ పనులకు అధిక ప్రాధాన్యం

ప్రతిపాదనల్లో ఊసే లేని గుండ్రేవుల రాయలసీమ లిఫ్ట్‌ లేనట్టే! నేడు రాష్ట్ర బడ్జెట్‌

కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాల్లోని సాగు నీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయలేకపోయింది. ఈ ఏడాది భారీగా వర్షాలు కురిసినప్పటికీ సాగు విస్తీర్ణం పెరగలేదు. ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు ప్రభుత్వం నేడు(శనివారం)శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లోనైనా సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

బడ్జెట్‌కు ప్రతిపాదనలు ఇవీ..

వేదావతి ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు సేకరణ చేయాల్సింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. అలాగే 300కిపైగా గ్రామాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం కానుంది. తుంగభద్ర దిగువ కాలువతో పాటు వేదావతి, ఆర్డీఎస్‌లకు రూ.280 కోట్లు, భూసేకరణకు రూ.154 కోట్లతో బడ్జెట్‌కు ప్రతిపాదనలు చేశారు.

గోరుకల్లు పనులు సాగేనా?

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటిని తరలించడంలో కీలకమైంది గోరుకల్లు రిజర్వాయర్‌. ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం 12.4 టీఎంసీలు. 265.6 మీటర్లు ఎత్తుకుగాను, ఇప్పటి వరకు 262 మీటర్లు పని చేసి, గత ప్రభుత్వ హాయాంలో 11.2 టీఎంసీల నీటిని నిల్వ చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. 2014–19 వరకు టీడీపీ మాయాంలో 3.66 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. పెండింగ్‌ పనులతో పాటు కుంటుతున్న రాతిపరుపు పనులు పూర్తి చేసేందుకు రూ.40 కోట్లకు ఈ ఏడాది బడ్జెట్‌కు ప్రతిపాదనలు చేశారు. కేసీ కాలువ పరిధిలోని 2.65 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఆలగనూరు రిజర్వాయకు మరమ్మతులు చేసేందుకు రూ.25 కోట్లతో ప్రతిపాదించారు.

లోతు పెరిగిన ఫ్లంజ్‌ఫూల్‌

శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో వచ్చిన వరదలతో ఫ్లంజ్‌ఫూల్‌ లోతు పెరిగి ప్రమాదరంగా మారింది. అదే సమయంలో డ్యాం కుడి వైపు కొండ చరియలు జారి పడి దిగువన ఉన్న రోడ్డు కొట్టుకపోయింది. అత్యవసరంగా పనులు చేసేందుకు, డ్యాం నిర్వహణకు బడ్జెట్‌లో రూ.100 కోట్లకు ప్రతిపాదించారు.

ఉమ్మడి జల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పెండింగ్‌ పనులకు, భూసేకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉంటాయి.

– కబీర్‌ బాషా, జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ

మరమ్మతులకు నోచుకోని ఆలగనూరు రిజర్వాయర్‌

గుండ్రేవుల.. కలేనా!

రాయలసీమలోని కర్నూలు–కడప కాలువ పరిధిలోని 2.65 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగు నీటిని అందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మిస్తామని చెప్పిన గుండ్రేవుల ప్రాజెక్టు బడ్జెట్‌లో ఎలాంటి ఊసేలేదు. దీంతో పాటు శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే నీటిని కరువు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌కు సైతం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కీలకమైన పందికొన రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం నిలిపేందుకు, కాలువల పనులు చేసేందుకు రూ.275 కోట్లతోను, 68 చెరువుల పథకం నిర్వహణకు రూ.35 కోట్లకు, ప్రపోజ్‌ చేశారు.

జీడీపీలో పెండింగ్‌లో పనులు చేసేందుకు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పెండింగ్‌ బిల్లులు రూ.40 కోట్ల వరకు ఇప్పటి వరకు రాలేదు.

కేసీ కాలువ హెడ్‌ కింద రూ.150 కోట్లతో కుందునది విస్తరణ చేపట్టేందుకు, కాల్వల మరమ్మతులకు, నిర్వహణకు రూ.145కోట్లు సుంకేసుల బ్యారేజీ కరెంట్‌ బిల్లులకు రూ.4 కోట్లకు బడ్జెట్‌లో ప్రపోజ్‌ చేశారు.

తెలుగుగంగ కాల్వలో భాగంగా వెలుగోడు, సిద్ధాపురం లిఫ్ట్‌ నిర్వహణకు 89 కోట్లు, వెలుగోడు నుంచి తెలుగుగంగా కాల్వ లైనింగ్‌, నిర్వహణకు రూ.153 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement